మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

Posted: 19/09/2010 in అవర్గీకృతం, రజకుల గురుంచి కొన్ని నిజాలు

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది)

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 జూలై 19 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు.

సామాజిక నేపథ్యం

ఆంధ్ర ప్రాంతం నుండి తరలి వచ్చిన ప్రజలు తెలంగాణా ప్రాంతంలో భూములు కొని, వ్యవసాయం చేసి అభివృద్ధి సాధించారు. ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణా ప్రజలు భావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణా ప్రజల్లో కలిగింది. తెలంగాణా విద్యాసంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని విద్యార్ధుల్లో అసంతృప్తి నెలకొని ఉంది.

రాజకీయ నేపథ్యం

1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడీ అయిన మర్రి చెన్నారెడ్డి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు,గనుల శాఖమంత్రిగా ఢిల్లీ వెళ్ళడంతో, ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. అయితే, కొద్దిరోజుల్లోనే అనుకోని ఒక సంఘటన జరిగింది.
అంతకు కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన వందేమాతరం రామచంద్రరావు వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చెయ్యకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, పైకోర్టుకు వెళ్ళాడు. అక్కడా ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది.

ఉద్యమ ప్రారంభం

తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్ధి నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్ధుల సమావేశంలో – తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.

అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్ధులలోని ఒక వర్గం “తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి” గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు “తెలంగాణా పరిరక్షణల కమిటీ” ని ఏర్పాటు చేసారు.
జనవరి 18 న విద్యార్ధుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది.

అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.
అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది.

రెండవ దశ

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు

జనవరి 24సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చనిపోయాడు. జనవరి 27న రంగాచార్యులు అనే ఒక ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగిని నల్గొండ పట్టణంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆంధ్ర ప్రాంతపు ప్రజలలో భయాందోళనలు చెలరేగాయి.
జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. క్రమేణా ఆందోళనలో హింసాత్మక చర్యలు పెరగసాగాయి. ఆంధ్రప్రాంతపు వారి ఆస్తులు తగలబెట్టడం, దోపిడిలు విస్తృతంగా జరిగాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు సమ్మెలు చెయ్యసాగారు. తెలంగాణాలోని అనేక పట్టణాల్లోను, ఆంధ్రాలోని కొన్ని పట్టణాల్లోను సైన్యం కవాతు జరిపింది. ఉద్యమం శాంతియుతంగా జరపాలని కోరుతూ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసాడు. అయినా హింస తగ్గలేదు. ఫిబ్రవరి 25న తాండూరు లో హింసాత్మక ఘటనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు.

కోర్టు కేసులు

1969,జనవరి 22 నాటి ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల అధికరణాలకు విరుద్ధమని కొందరు ఉద్యోగులు హై కోర్టులో దావా వేసారు.

అలాగే ఇదే ప్రభుత్వ ఉత్తర్వుకు వ్యతిరేకంగా జనవరి 31న ఐదుగురు తెలంగాణా ప్రాత ఉద్యోగినులు మరో దావా వేసారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాతం వారని, ఈ ప్రభుత్వ ఉత్తర్వు వలన తమకు అన్యాయం జరుగుతుందని వారి వాదన.

1969,ఫిబ్రవరి 3: ఆ ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని హై కోర్టు తీర్పు నిచ్చింది.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో మరో దావా వెయ్యగా, కోర్టు తమ ఫిబ్రవరి 3 నాటి తీర్పు అమలు పై స్టే ఇచ్చి, విచారణకు డివిజను బెంచిని ఆదేశించింది. ఫిబ్రవరి 18 న సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చి, ఉద్యోగుల బదిలీలను ఆపేసింది.

1969,ఫిబ్రవరి 20: హైకోర్టు మరో తీర్పు ఇస్తూ, ఇలా వ్యాఖ్యానించింది.

  • ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమే.
  • అయితే, బయటి వారిని వెనక్కి పంపకుండా, వారికొరకు అదనపు ఉద్యోగాలను (సూపర్ న్యూమరీ) సృష్టించాలి.

అదనపు ఉద్యోగాల విషయమై తెలంగాణా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చెయ్యగా, ముల్కీ నిబంధనల పై ఆంధ్ర ప్రాంతంలో నిరసనగా సమ్మెలు జరిగాయి.

1969,మార్చి 7: ముల్కీ నిబంధనల అమలుపై మునుపు తనిచ్చిన స్టేను ధృవీకరిస్తూ, అదనపు పోస్టుల సృష్టించడాన్ని కూడా నిలిపివేసింది.

1969,మార్చి 29: సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది:

  • ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
  • తెలంగాణాలోని ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపే ప్రభుత్వ ఉత్తర్వు రద్దు

తెలంగాణా ప్రజాసమితి

1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణా బందును జరిపింది.

ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రేసు పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి

మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. మే 1మేడే నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15 న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందేమాతరం రామచంద్రరావు, బద్రివిశాల్ పిట్టి వీరిలో ఉన్నారు.
1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దోపిడీలు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది. విద్యార్ధులతోపాటు, కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేసారు. జూన్ 10 నుండి తెలంగాణా ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు.
1969 జూన్ 24 న తెలంగాణా నాయకులు ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు. జూన్ 27 న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు.
1969 ఆగష్టు 18 న లోక్‌సభలో తెలంగాణా ప్రాంత ప్రతినిధులు జి.వెంకటస్వామి, జి.ఎస్.మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణా గురించి తమ వాదనను వినిపించారు. ఆగష్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది.

ఉద్యమం వెనుకంజ

1969 సెప్టెంబర్ లో ఉద్యమం చల్లారడం మొదలైంది. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ “ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు” అని అన్నాడు. ఉద్యమ తిరోగమనానికి ఇది ఒక సూచిక. విద్యార్ధులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణా ప్రజా సమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేసారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వి.వి.గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయం తెలిపాడు. దీనితో విద్యార్ధులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా, విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. సెప్టెంబర్ 25 న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి, తెలంగాణాను ఏర్పాటు చెయ్యాలని కోరాడు.
విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.

అక్టోబర్ 10 నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్ధులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది.
1969 నవంబర్ 26 చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.
ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి, 1969 డిసెంబర్ వరకు రాజకీయనాయకుల ఎత్తులు పైయెత్తుల మధ్య, ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్లారిపోయింది. తెలంగాణా ప్రజాసమితి మరో రెండేళ్ళు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.

 ఇతర విశేషాలు

తెలంగాణా ఉద్యమంలో కొన్ని ప్రత్యేకతలు కలిగిన విశేషాలు:

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s